కార్పొ‘రేటు’ కళాశాలల దందా, ఫీజులు పిండేస్తున్నారు – ఏటా రూ.3 వేల కోట్లకు పైగా వ్యాపారం

పిల్లల పదో తరగతి చదువు పూర్తవుతుందంటే.. తల్లిదండ్రుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. కార్పొరేట్‌ జూనియర్‌ కళాశాలలు ఫీజుల పేరిట రెండేళ్లపాటు ఒక్కో విద్యార్థి నుంచి లక్షల్లో సొమ్ములు పిండేస్తున్నాయి. రుసుములపై ప్రభుత్వ నియంత్రణ లేకపోవడంతో యాజమాన్యాలు ఎంత చెబితే అంత కిక్కురుమనకుండా చెల్లించడం తప్పనిసరయిపోయింది. రాష్ట్రంలో కార్పొరేట్‌ కళాశాలల విద్యా వ్యాపారం రూ.3 వేల కోట్లు దాటుతోందంటే రుసుముల పేరిట ఎంత దోపిడీ జరుగుతుందో అర్ధమవుతోంది.

కొన్ని చోట్ల ఏడాదికి రూ.3 లక్షల వరకు ఫీజులు వసూలు చేయడం యాజమాన్యాల బరితెగింపును కళ్లకు కడుతోంది. పర్యవేక్షించాల్సిన ఇంటర్‌ బోర్డు.. కార్పొరేట్‌ కళాశాల యాజమాన్యాల చేతుల్లో కీలుబొమ్మగా మారిందన్న విమర్శ యాజమాన్యాల పెత్తనం ఏ స్థాయిలో ఉందో చెబుతోంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా చేష్టలుడిగి చూస్తుండడం పరిస్థితిని మరింత క్లిష్టంగా మారుస్తోంది. పదో తరగతి పరీక్షలు ఇంకా ప్రారంభమే కాలేదు.. అప్పుడే కార్పొరేట్‌ కళాశాలలు విద్యార్థుల ప్రవేశాలకు వాలిపోతున్నాయి. పాఠశాలల నుంచి విద్యార్థుల ఫోన్‌ నెంబర్లను సేకరిస్తున్న పీఆర్వోలు విద్యార్థుల ఇళ్లకు వెళ్లడం, ఫోన్లలో సంప్రదింపులు మొదలుపెట్టేశారు.

ఇప్పుడు సీటు బుక్‌ చేసుకుంటే రుసుములు తగ్గిస్తామని, నెల తర్వాత వస్తే సీట్లే ఉండవంటూ విద్యార్థుల తల్లిదండ్రులను హైరానా పెడుతున్నారు. పదో తరగతి పరీక్షలు ఈ నెల 15 నుంచి ప్రారంభమవుతున్నాయి.. త్వరలో ప్రవేశాలకు ఇంటర్‌ బోర్డు కాలపట్టిక జారీ చేయబోతోంది. ఈ నేపథ్యంలో కార్పొరేట్‌ కళాశాలల్లో ఇష్టారాజ్యంగా వసూలు చేస్తున్న రుసుములు, రాష్ట్ర ప్రభుత్వ ఉదాసీనతపై ‘ఈనాడు’ ప్రత్యేక కథనం.

తెలంగాణలోని కార్పొరేట్‌ కళాశాలల్లో ఫీజుల దోపిడీ కొనసాగుతూనే ఉంది. ఈ కళాశాలలు అత్యధికం హైదరాబాద్‌, చుట్టుపక్కలే ఉన్నాయి. రాష్ట్రంలో అయిదారు కార్పొరేట్‌ గ్రూపు సంస్థలున్నాయి. వాటిల్లో రెండు గ్రూపులదే హవా. అవి ఒక్కో కళాశాలలకు ఒక్కో పేరు పెడతాయి. అందులో ఏసీ, నాన్‌-ఏసీ రెసిడెన్షియల్‌, సెమీ రెసిడెన్షియల్‌, డే స్కాలర్‌.. ఇలా రకరకాల బ్యాచ్‌లు. ఒక్కో బ్యాచ్‌కు ఒక్కో రుసుము. ఐపీఎల్‌, నియాన్‌, నియాన్‌ ఐసీ, సూపర్‌ 60, ఎయిమ్స్‌ సూపర్‌ 60, ఐకాన్‌ తదితర ఎన్నో పేర్లు పెడుతున్నారు. ఒక్కో దానికి ఒక్కో ప్రత్యేకత చెబుతారు. ఇంటర్‌+ ఎంసెట్‌, ఇంటర్‌+ జేఈఈ మెయిన్‌ (ఎన్‌ఐటీ), ఇంటర్‌+ జేఈఈ అడ్వాన్సుడ్‌ (ఐఐటీ), ఇక బైపీసీ గ్రూపు విద్యారులకు ఇంటర్‌+ ఎంసెట్‌, ఇంటర్‌+ ఎంసెట్‌+ నీట్‌, ఇంటర్‌+ నీట్‌+ఎయిమ్స్‌… ఇలా పేర్లు పెట్టి ఒక్కో దానికి ఒక్కో రకమైన రుసుములు వసూలు చేస్తున్నారు. మొత్తానికి రెసిడెన్షియల్‌ విద్యారులకు రూ.70 వేల నుంచి రూ.2.60 లక్షల వరకు రుసుములున్నాయి.

అప్పులు చేసి.. ఆస్తులమ్మి
రుసుములను మూడు విడతల్లో చెల్లించాలి. చివరి వాయిదాను పరీక్షలకు ముందే కట్టేయాలి. లేదంటే హాల్‌టిక్కెట్లు ఇచ్చేది లేదని బెదిరిస్తారు. ఈ కళాశాలల్లో చదివిస్తున్న వారిలో ఎక్కువ మంది చిరుద్యోగులు, చిన్న,సన్నకారు రైతులే. పంటలు పండక, పండినా గిట్టుబాటు ధరలు దక్కక రైతులు పిల్లల్ని చదివించేందుకు అప్పులు చేస్తున్నారు. చిరుద్యోగులు, చిన్నవ్యాపారులు కూడా అప్పులు చేస్తేగానీ పిల్లల చదువులు గట్టెక్కడం లేదు. తర్వాత వాటికి వడ్డీలు కట్టి, వాయిదాల్లో చెల్లించేది కొందరయితే.. ఉన్న కాస్తో కూస్తో భూమిని అమ్ముకుని అప్పులు తీరుస్తున్నవాళ్లు మరికొందరు.

ప్రత్యామ్నాయం లేదంటూ ప్రచారం
పదో తరగతి వరకు ఎటుచూసినా ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలు ఉంటున్నాయి. దానివల్ల తక్కువ రుసుములతోనే చదివిస్తున్నారు. ఇంటర్‌కు వచ్చేసరికి మండలాల్లో ఒకటి రెండు కళాశాలలున్నా వాటిలో నాణ్యమైన విద్య లభించడం లేదు. దీనివల్ల అధిక శాతం మంది ప్రైవేట్‌ బాట పడుతున్నారు. అందులోనూ మూడు, నాలుగు కార్పొరేటు గ్రూపు విద్యాసంస్థలు తమ కళాశాలల్లో చదివితే తప్ప పిల్లలు ఇంజినీరో, డాక్టరో కావడం సాధ్యం కాదన్న భావన కల్పించాయి. అయిదారు ర్యాంకులను సాధిస్తూ విస్తృత ప్రచారం కల్పించి మిగతా కళాశాలల్లో ఎక్కడ చేరినా మీ పిల్లల భవిష్యత్తును మీరే కూల్చివేసినట్లుగా చిత్రీకరిస్తున్నాయి. దీంతో అధికశాతం తల్లిదండ్రులు పిల్లలను కార్పొరేట్‌ కళాశాలల్లోనే చేర్పిస్తున్నారు. రెండేళ్లపాటు చదివిన తర్వాత ర్యాంకులేమోగానీ లక్షల్లో రుసుములు చెల్లించేసరికి అప్పుల్లో మునిగిపోతున్నారు.

దూరా‘భారం’ తప్పదు
అత్యధిక కార్పొరేట్‌ కళాశాలలు హైదరాబాద్‌, నగర శివారులో ఉన్నందున అన్ని జిల్లాల పిల్లలను ఇక్కడే చేర్పిస్తున్నారు. మొత్తం 9.50 లక్షల మందిలో ఒక్క హైదరాబాద్‌ జిల్లా పరిధిలోనే ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల విద్యారులు 1.65 లక్షల మంది ఉన్నారు. రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాలను కూడా పరిగణనలోకి తీసుకుంటే దాదాపు 4.50 లక్షల మంది కేవలం గ్రేటర్‌ హైదరాబాద్‌లోనే చదువుకుంటున్నారు. వీరిని చూడడానికి జిల్లాల నుంచి ప్రతి నెలా కనీసం రెండుసార్లయినా తల్లిదండ్రులు నగరానికి వస్తున్నారు.

బస్సుల్లో అయితే సమయానికి అందుకోలేమని, నగరానికి దూరంగా ఉన్న కళాశాలల ప్రాంగణాలకు చేరుకోవడం కష్టంగా ఉండడంతో నలుగురైదుగురు లేదా రెండు కుటుంబాలు కలిసి కార్లలో వస్తున్నారు. అందుకు ప్రతి నెలా ఖర్చు తప్పడం లేదు. కరీంనగర్‌కు చెందిన రెండు కుటుంబాలు హైదరాబాద్‌ నిజాంపేటలోని తమ పిల్లల కోసం నెలకు రెండుసార్లు వస్తున్నాయి. వారి వాహన ఖర్చే నెలకు రూ.2,500- రూ.3 వేలు. ఇటీవల కాలంలో నగరంలో అద్దె ఎక్కువగా ఉంటుందని కొన్ని కళాశాలలను ఔటర్‌ రింగ్‌ రోడ్డు అవతలికి మార్చారు. దాంతో అక్కడికి వచ్చి పిల్లలను చూసి తిరిగి వెళ్లాలంటే కారు ప్రయాణం తప్పనిసరవుతోంది.

ఇంటర్‌ బోర్డు ఏం చేస్తోంది?
పాఠశాలల్లో రుసుముల నియంత్రణపై 1994లోనే జీవోలు జారీ అయ్యాయి. వాటిలో ఎన్నో నియమ నిబంధనలను పేర్కొన్నారు. ఏటా సెప్టెంబరులోపు ఆడిట్‌ నివేదికను కూడా విద్యాశాఖకు సమర్పించాలి. విచిత్రమేమిటంటే ఇంటర్‌ విద్యకు అలాంటి నిబంధనలుగానీ, జీఓగానీ లేకపోవడమే. ఎన్ని సెక్షన్లకు అనుమతి తీసుకున్నారు? రుసుం చెల్లించి అనుబంధ గుర్తింపు తీసుకున్నారా? లేదా? అన్నదే ఇంటర్‌ బోర్డు చూస్తోంది. వాస్తవానికి ఇంటర్‌ ప్రథమ సంవత్సరానికి రూ.1760, ద్వితీయ ఇంటర్‌కు రూ.1940ని ప్రభుత్వం బోధనా రుసుం కింద చెల్లిస్తోంది.

కార్పొరేట్‌ కళాశాలలేమో రెసిడెన్షియల్‌ విధానంలో నడుస్తున్నాయి. అందుకు ఎంత రుసుం అన్నది ఎక్కడా పేర్కొనలేదు. తాము ఇంటర్‌ పాఠాలు మాత్రమే బోధించడం లేదని, జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలకు కూడా శిక్షణ ఇస్తున్నామని…ఇంటిగ్రేటెడ్‌ విధానమని యాజమాన్యాలు చెప్పుకుంటున్నాయి. దాంతో ఫీజు ఎంత వసూలు చేసుకోవాలన్న నియంత్రణ లేక యాజమాన్యాల ఇష్టారాజ్యమైంది. ఆడిట్‌ నివేదిక కూడా సమర్పించేది లేకపోవడంతో కొన్ని కళాశాలలు బరి తెగిస్తున్నాయి. ఇంటర్‌ బోర్డు సైతం కార్పొరేట్‌ యాజమాన్యాల చేతుల్లో కీలుబొమ్మగా మారిపోయిందన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రయోగ పరీక్షల్లో జంబ్లింగ్‌, వాటికి సీసీ కెమెరాల నిఘా, ఆన్‌లైన్‌ ప్రవేశాలు, రుసుముల నిర్ధారణ.. ఇలా ఏ ఒక్కటీ అమలు కాకపోవడానికి కార్పొరేట్‌ శక్తులే కారణమని తెలుస్తోంది. ఇంటర్‌ బోర్డు మాత్రం ప్రగల్భాలు పలుకుతూ కాలం గడిపేస్తోంది.

వేల కోట్ల వ్యాపారం
రాష్ట్రంలో చదివే ఇంటర్మీడియట్‌ విద్యార్థుల్లో నాలుగైదు గ్రూపు కళాశాలల్లోనే 40 శాతం మంది చదువుతున్నారు. అందులోనూ 80 శాతం మంది కేవలం రెండు కార్పొరేట్‌ కళాశాలల్లోనే. ఇక్కడ రుసుం రూ.2.60 లక్షల వరకు వసూలు చేస్తున్నారు. కొందరి నుంచి రూ.3 లక్షలు కూడా తీసుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు నాలుగు లక్షల మంది విద్యార్థులు కార్పొరేట్‌ కళాశాలల్లో చదువుతున్నారు. సగటున ఒక్కో విద్యార్థికి రూ.75 వేలు అనుకున్నా మొత్తం విద్యా వ్యాపారం రూ.3 వేల కోట్లు. దీర్ఘకాలిక శిక్షణ తీసుకుంటున్న దాదాపు 30 వేల మందిపై జరిగే రూ.375 కోట్ల వ్యాపారం దీనికి అదనం.

రూ.కోట్లలో లాభాలు
హైదరాబాద్‌ దిల్‌సుఖ్‌నగర్‌లో ఓ కార్పొరేట్‌ బ్రాంచిలో 1800 మంది విద్యార్థులున్నారు. అంతా డే స్కాలర్లే. ఇక్కడ ఎంపీసీ, బైపీసీ గ్రూపులు, దాంతోపాటు ప్రవేశ పరీక్షల శిక్షణలకు కలిపి ఏడాదికి రూ.35 వేల నుంచి రూ.75 వేల వరకు రుసుము వసూలు చేస్తున్నారు. కనీస రుసుములను పరిగణనలోకి తీసుకుంటే ఆ రూపేణా వచ్చే ఆదాయం రూ.6.55 కోట్లు. అందులో యాజమాన్యానికి కనీసం మిగిలేది రూ.2 కోట్లు. అంటే 30%. తక్కువ రుసుములుండే ప్రాంగణాల నుంచి 15-20%, అధిక రుసుములున్న కళాశాలల నుంచి 25-30% లాభాలు దక్కుతాయని హైదరాబాద్‌లో రెండు కళాశాలల బ్రాంచీలను నడుపుతున్న యజమానే చెప్పడం గమనార్హం. #KhabarLive