కోమటిరెడ్డి బ్రదర్స్ కు పిసిసి ఉత్తమ్ పొగ, నకిరేకల్ లో యువ డాక్టర్ ను దింపేందుకు ఉత్తమ్ స్కెచ్

భారత దేశాన్ని దశాబ్దాల పాటు ఏలిన పార్టీ కాంగ్రెస్. అటువంటి కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం చాలా ఎక్కువ. తెలంగాణలో అయితే ఆ ప్రజాస్వామ్యం మరీ ఎక్కువ. కాంగ్రెస్ పార్టీలో ఎవరికి వారే నాయకులు. ఒకరి మాట ఒకరు వినే ముచ్చటే ఉండదు. కాకపోతే ఎన్నికలు వచ్చినప్పుడు కలిసిపోతారు. పార్టీని అధికారంలోకి తెచ్చుకుంటారు. ఇక ఎన్నికల ముందు.. ఎన్నికల తర్వాత కొట్లాటలు వాళ్లకు వెన్నతో పెట్టిన విద్య.

ఇక అసలు విషయానికి వస్తే తెలంగాణ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి రెండో పిసిసి అధ్యక్షుడిగా ఎంపికయ్యారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఆయన కంటే ముందు పొన్నాల లక్ష్మయ్య తెలంగాణ కాంగ్రెస్ కు తొలి పిసిసి అధ్యక్షులు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రస్తుతం హుజూర్ నగర్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన సతీమణి ఉత్తమ్ పద్మావతి కోదాడ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా ఎంపికైన నాటి నుంచి ఇంచుమించుగా నేటి వరకు ఆయనను కోమటిరెడ్డి సోదరులు ఏనాడూ లెక్క చేయలేదు.

పార్టీ వేదికల మీద ఉత్తమ్ మీద విరుచుకుపడ్డారు. అంతర్గత సమావేశాల్లో కానీ.. ఓపెన్ మీటింగుల్లో కానీ.. ఉత్తమ్ మీద విమర్శలు గుప్పించారు. అసలు ఉత్తమ్ ను తాము పిసిసి అధ్యక్షుడిగా లెక్క చేయడంలేదని చెప్పుకున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డిని దింపేందుకు కోమటిరెడ్డి సోదరులిద్దరూ అనేక సందర్భాల్లో తీవ్రమైన ప్రయత్నాలే చేశారు. చేసి చేసి విసిగిపోయారు. ఉత్తమ్ ను మార్చేందుకు అధిష్టానం నో చెప్పింది. దీంతో ఇక లాభం లేదనుకుని ఉత్తమ్ తో కలిసి పనిచేసే ప్రయత్నం చేస్తున్నారు.

అయితే ఇన్నిరోజులు కోమటిరెడ్డి బ్రదర్స్ పొగ పెట్టినా.. ఓపిగా భరించారు ఉత్తమ్. ఇక పిసిసి పదవి తనకు పదిలమైందని నమ్మిన తర్వాత మెల్ల మెల్లగా ఇప్పుడు కోమటిరెడ్డి సోదరులకు ఉత్తమ్ పొగ పెట్టుడు షురూ చేశారు. తెలంగాణ కాంగ్రెస్ లో ఇప్పుడు సీన్ రివర్స్ అయిన పరిస్థితి ఉంది. అదెట్లా అంటారా? చదవండి మరి.

నల్లగొండ జిల్లాలోని నకిరేకల్ నియోజకవర్గంలో కోమటిరెడ్డి సోదరులకు మంచి పట్టుంది. వారి సొంత నియోజకవర్గం కూడా ఇదే. అయితే ఇది ఎస్సీ రిజర్వుడు సీటు కావడంతో సోదరులిద్దరూ బయటి ప్రాంతాల్లో పోటీ చేస్తున్నారు. ఇక్కడ కోమటిరెడ్డి సోదరులకు అత్యంత సన్నిహితుడు, అనుచరుడు అయిన చిరుమర్తి లింగయ్య 2009 ఎన్నికల్లో పోటీ చేసి గెలపొందారు. నియోజకవర్గంలో మంచిపేరు సంపాదించుకున్నారు. కానీ తర్వాత తెలంగాణ ఉద్యమ ప్రభావం కారణంగా 2014 ఎన్నికల్లో చిరుమర్తి ఓడిపోయారు. 2014 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ గన్ షాట్ గా గెలిచే సీట్లలో నకిరేకల్ ముందుంది. కానీ అనూహ్యంగా ఆయన ఓటమిపాలయ్యారు. ఇక ఇప్పుడు మళ్లీ చిరుమర్తి 2019 కి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు.

అయితే ఇదే నియోజవర్గం నుంచి పోటీకి దిగేందుకు మరొక యువ డాక్టర్ సన్నద్ధమవుతున్నాడు. ఆయన పేరు డాక్టర్ ప్రసన్నరాజ్. ఆయన గతం నుంచీ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. పసన్నరాజ్ ఉత్తమ్ అనుచరుడిగా గుర్తింపు పొందారు. ఉత్తమ్ ఆశిష్సులతో ప్రసన్నరాజ్ నకిరేకల్ లో తనదైన శైలిలో చాప కింద నీరు మాదిరిగా యాక్టివిటీస్ చేస్తూ పోతున్నారు.

రానున్న ఎన్నికల్లో కోమటిరెడ్డి సోదరులకు చెక్ పెట్టేందుకు ఎలాగైనా డాక్టర్ ప్రసన్నరాజ్ కు కాంగ్రెస్ టికెట్ ఇప్పించే ప్రయత్నాల్లో ఉత్తమ్ ఉన్నట్లు కాంగ్రెస్ పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇంతకాలం ఉత్తమ్ కు కోమటిరెడ్డి సోదరులు పొగపెడితే.. కోమటిరెడ్డి సోదరులకు ఇలాకాలోనే ఉత్తమ్ వారిద్దరికీ పొగ పెడుతున్నారని కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక నేత వ్యాఖ్యానించారు. ఈసారి ప్రసన్నరాజ్ కు నకిరేకల్ టికెట్ గ్యారెంటీ అని అదే నియోజకవర్గానికి చెందిన ఒక యువ నేత ఏషియానెట్ కు తెలిపారు.

కోమటిరెడ్డి సోదరులు ఎక్కడ పోటీ చేస్తారో వాళ్లకే క్లారిటీ లేనప్పుడు ఇక నకిరేకల్ ను వాళ్లేం పట్టించుకుంటారని ఆయన ప్రశ్నించారు. రానున్న ఎన్నికల్లో కోమటిరెడ్డి బ్రదర్స్ కు ఉత్తమ్ గట్టి షాక్ ఇచ్చినా ఆశ్చర్యం అవసరం లేదని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. మరి ఈ వ్యవహారం ఎటు మలుపు తిరుగుతుందా అని నకిరేకల్ పార్టీ వర్గాల్లో హాట్ హాట్ గా చర్చ నడుస్తోంది. #KhabarLive